ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్ కి నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ బృందం విచారణ ముమ్మరం చేసింది. కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న కేరళ వాసి, కేరళలో ఎన్డీఏ ఫ్రంట్ కి కన్వీనర్ గా పనిచేసిన తుషార్ కి సిట్ నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. భారత ధర్మ జనసేన పార్టీ స్థాపించిన తుషార్.. గత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో వయనాడ్ పార్టమెంట్ స్థానంలో రాహుల్ గాంధీ మీద పోటీ చేశారు.
కాగా, తుషార్.. ఈ కేసులో రామచంద్ర భారతి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలతో మాట్లాడినట్టుగా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. వీటిని విచారించిన కోర్టు కేసును సిట్ కి అప్పగించిన విషయం తెలిసిందే. కేసును లోలోతుగా విచారించే క్రమంలో విచారణకు రావాల్సిందిగా తుషార్ కి సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. నవంబర్ 21న విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించింది. బీజేపీలోని కీలక నేతలు తుషార్ కి సన్నిహితులు అంటూ ఫోన్ కాల్ రికార్డింగుల్లో సంభాషణలు ఉన్నాయి. కాగా రెమా రాజేశర్వరి నేతృత్వంలోని సిట్ దర్యాప్తు బృందం విచారణ నిమిత్తం కేరళ వెళ్లింది. కొచ్చి, కొల్లాంలోని పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. రామచంద్ర భారతి ప్రధాన అనుచరుడైన జగ్గుస్వామి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. తుషార్ ని రామచంద్ర భారతికి పరిచయం చేసింది జగ్గుస్వామే. రామచంద్ర స్వామికి చెందిన అమృతానందమయి ఆశ్రమంలో జగ్గుస్వామి ఉద్యోగిగా పనిచేసేవాడు. 2019 వరకు రామచంద్ర భారతి అమృతానంద ఆశ్రమంలో ఉన్నట్టు సిట్ బృందం విచారణలో తేలింది.
