హైదరాబాద్: ఇంజినీరింగ్ కాలేజీలు సహా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల జరిమానా విధిస్తామని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) హెచ్చరించింది. దీంతోపాటు విద్యార్థుల నుండి వసూలు చేసిన అదనపు రుసుమును కాలేజీలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శనివారం టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ పీ స్వరూప్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వీ కరుణ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొ.ఆర్ లింబాద్రి ఇతర అధికారులు హాజరైన ఏఎఫ్‌ఆర్‌సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
బి-కేటగిరీ అడ్మిషన్ల కింద విద్యార్థులను చేర్చుకునే సమయంలో కాలేజీలు మెరిట్ ఉల్లంఘించినట్లు తేలితే ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించాలని కమిటీ నిర్ణయించింది. ఏఎఫ్‌ఆర్‌సీ కళాశాలలకు ఫార్వార్డ్ చేసిన విద్యార్థుల పేర్లను ఆయా కళాశాలలు మెరిట్ సీట్ల కేటాయింపుకు పరిగణనలోకి తీసుకున్నాయా లేదా అని కూడా తనిఖీ చేస్తామని ఏఎఫ్‌ఆర్‌సీ కమిటీ తెలిపింది. ఇందులో అక్రమాలు జరిగాయని తేలితే.. విద్యార్థికి రూ. 10 లక్షల జరిమానా విధించబడుతుందని, ఆపై అడ్మిషన్లను రద్దు చేయాలని సిఫార్సు కూడా చేస్తామని ఏఎఫ్‌ఆర్‌సీ కళాశాలలను హెచ్చరించింది.

