హైదరాబాద్: విమానం ఏంటీ.. అండర్‌పాస్ కింద ఇరుక్కుపోవడం ఏంది అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. విమానమే.. అండర్ పాస్ కింద ఇరుక్కుపోయింది. అసలు ఆ విమానం గాల్లో కాకుండా రోడ్డు మీదకు ఎందుకొచ్చిందో తెలుసుకుందాం.
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ యజమాని.. కొచ్చిలో ఓ పాత విమానాన్ని కొనుగోలు చేశారు. నగర శివార్లలో ఉన్న షామీర్‌పేటలో ఆ విమానంలో కొత్తగా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. కొచ్చి నుంచి ఆ విమానాన్ని ప్రత్యేక ట్రాలీపై హైదరాబాద్‌కు తరలించడం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కోరిసపాడు చేరగానే అండర్‌పాస్ వద్ద ఇరుక్కుపోయింది. విమానం ముందుభాగం బ్రిడ్జి కిందినుంచి బాగానే వెళ్లినా.. మధ్యలోకి వచ్చేసరికి వంతెన కిందిభాగానికి రాసుకుంది. చాలాసేపు కష్టపడ్డ ట్రక్ డ్రైవర్ విమానానికి ఎలాంటి నష్టం జరుగకుండా అండర్‌పాస్ దాటించాడు.
విమానం అండర్‌పాస్ కింద ఇరుక్కుపోయిందన్న వార్త తెలియడంతో చుట్టుపక్కల వారు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. విమానాన్ని ట్రక్కుపై తరలిస్తున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించగా.. అందులో కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

