మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో నిందితులుగా శిక్ష అనుభవిస్తున్న ఆరుగురిని కోర్టు విడుదల చేసింది. అందులో నళినీ శ్రీహరన్ (Nalini Sriharan) కూడా ఒకరు. వీరంతా మూడు దశాబ్దాల అనంతరం వారంతా బయట ప్రపంచంలోకి వచ్చారు. అయితే వారిలో కొందరు తమను దోషులుగానో.. నిందితులుగానో చూడకండి.. బాధితులుగా చూడమని కోరుతున్నారు. ఇంతకీ ఇందులో ఏకైనా మహిళా ఖైదీగా ఉన్న నళినీ శ్రీహరన్ ఎవరు..?

ప్రధానాంశాలు:
- మరోసారి తెరపైకి రాజీవ్ గాంధీ హత్య కేసు
- 30 ఏళ్ల తర్వాత విడుదలైన నిందితులు
- కేసులో ఏకైక మహిళా ఖైదీ నళిని శ్రీహరన్
- నిందితులపై సానుభూతి ఎందుకు..?
24 ఏళ్లకే అరెస్ట్...
నళినీ శ్రీహరన్ కేవలం 24 ఏళ్ల వయస్సులోనే 1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టైంది. మానవబాంబు పేల్చి రాజీవ్ గాంధీని హత్య చేసిన ఐదుగురు సభ్యుల బృందంలో నళిని కూడా ఉందని పోలీసుల ప్రధాన ఆరోపణ.
ఇంగ్లీష్‌లో గ్రాడ్యుయేషన్..
నళినీ శ్రీహరన్ తల్లిదండ్రులు పద్మావతి, శంకర్ నారాయణన్. వారికున్న ముగ్గురు పిల్లల్లో నళిని పెద్దమ్మాయి. నళిని చెన్నైలోని ఎతిరాజ్ కాలేజీలో ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ సంస్థలో స్టెనో గ్రాఫర్‌గా పనిచేసింది. అప్పుడే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) సభ్యుడు శ్రీహరన్ అలియాస్ మురుగన్‌ను కలిసింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
హత్యలో నళిని హస్తం...
తర్వాత రాజీవ్ గాంధీ హత్యా పథకం సూత్రదారుల్లో ఒక్కరైన ఎల్‌టీటీఈ (LTTE) కార్యకర్త శివరాసన్.. వారికి పరిచయం అయ్యాడు. ఈయన ఆ హత్య ప్రణాళికలో నళిని, శ్రీహరన్‌ను ఉపయోగించికున్నట్టు తెలుస్తుంది. పోలీసుల కథనం ప్రకారం రాజీవ్ గాంధీపై దాడి కోసం శ్రీలంక నుంచి తీసుకొచ్చిన ఇద్దరు మహిళలకు నళిని ఆతిథ్యం ఇచ్చింది. అంతేకాకుండా హత్యకు ప్రణాళిక రూపొందించినప్పుడు కూడా తన భర్తతోపాటు నళిని కూాడా ఉందని పోలీసులు చెప్పారు. అలాగే హత్య జరిగిన రోజున వారు ధరించిన దుస్తులను కొనుగోలు చేయడంలో ఇద్దరు మహిళా బాంబర్లకు నళిని సహాయం చేసింది.
జైల్లోనే ప్రసవం...
అరెస్ట్ అయ్యే సమయానికి నళిని గర్భవతి. ఆమె 1992లో జైల్లోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె పేరు హరితర. ఇప్పుడు ఒక డాక్టర్. ఇప్పుడు లండన్‌లో నివసిస్తున్నట్టు సమాచారం. హరితరకు 2019 సంవత్సరంలో వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం నళినికి నెల రోజుల పాటు పెరోల్‌పై బయటకొచ్చారు.
నేర చరిత్ర లేదు..
అయితే మొదటి నుంచి రాజీవ్ గాంధీ హత్య గురించి తనకు, తన భర్తకు ఏ మాత్రం తెలియదని నళిని వాదిస్తుంది. నిజానికి పోలీసుల కథనం ప్రకారం కూడా ఇన్నేళ్లు ఈ శిక్షను అనుభవించిన ఈ ఆరుగురు రాజీవ్ హత్యకు సంబంధించిన కుట్రలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నవారు.. కుట్ర అమలుకు నేరుగా బాధ్యత వహించిన వారు కాదు. విడుదలైన వారెవ్వరికీ అంతకు ముందు నేర చరిత్ర గాని, ఉగ్రవాద చరిత్ర గాని లేదు. కానీ మూడు దశాబ్దాలకుపైగా వారు జైల్లో ఉన్నారు. అలాగే రాజీవ్ గాంధీ హత్య వెనుక ఉన్న అసలు కుట్రదారులు మరుగున పడ్డారనే అనుమానాలు నేటికి వెన్నాడుతూనే ఉన్నాయి.
