Prashant Kishor ఎన్నికల వ్యూహకర్త, ఐ-ప్యాక్ అధినేత ప్రశాంత్ కిశోర్.. ప్రస్తుతం జన సూరజ్ యాత్ర పేరుతో తన సొంత రాష్ట్రం బిహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మీడియా అడిగి ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. తనపై జేడీయూ నేతలు తరుచూ చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

ప్రధానాంశాలు:
- జన సూరజ్ యాత్ర పేరుతో పాదయాత్ర
- నితీశ్ కుమార్‌పై పీకే మళ్లీ విమర్శలు
- ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు
బిహార్‌లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పీకే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే విధమైన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, దాని ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తే నితీశ్ మరోసారి తనపై దాడి చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ నేను నా కోసం ఒక స్వతంత్ర కార్యాచరణ ప్రారంభించడంతో ఆయన అనుచరులు నా పట్ల అసంతృప్తిగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘జేడీ(యు) నాయకులు నన్ను తిట్టడానికి ఇష్టపడతారు. నాకు రాజకీయ అవగాహన లేకపోతే రెండేళ్లు నేను అతని (బిహార్ సీఎం) నివాసంలో ఏమి చేశాను అని నితీశ్ కుమార్‌ను వారు అడగాలి’’ అని ఆయన అన్నారు. అయితే, గతంలో నితీశ్‌తో కలిసి పనిచేసినందుకు తాను చింతించడం లేదన్నారు.
‘‘10 సంవత్సరాల కింద అతను (కుమార్) ఉన్నదానికి, ఇప్పటికీ మధ్య చాలా వ్యతాసం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహించి 2014లో తన కుర్చీని వదులుకున్నారు.. ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నారా? అధికారం కోసం ఏ విధంగానైనా రాజీ పడతారు? అని అన్నారు. మహాకూటమి ప్రభుత్వం ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందన్న హామీపై పీకే మరోసారి స్పందించారు. ‘‘నేను చాలాసార్లు చెప్పాను..మళ్లీ అదే చెబుతున్నాను.. వారు హామీని నెరవేర్చినట్లయితే నేను నా ప్రచారాన్ని విరమించుకుంటాను’’ అని పేర్కొన్నారు.
