ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలోని ప్రాథమిక పరిషత్ ప్రాథమిక పాఠశాలను, వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి, మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. ముందుగా వన్ పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్, మన ఊరు - మన బడి పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ సదుపాయం, ఇతర మరమ్మత్తులు చేపడుతున్నట్లు కలెక్టర్ కు అధికారులు వివరించారు. పనుల పురోగతిలో వేగం పెంచాలని, వచ్చే సంక్రాంతి లోగా పనులన్నింటినీ పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన తొలిమెట్టు కార్యక్రమం అమలుపై కలెక్టర్ సమీక్షించారు. స్వయంగా పిల్లలతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు ధారాళంగా చదివేలా, రాసేలా, గణితంలో చతుర్వేద ప్రక్రియలు చేసేలా చూడాలని అన్నారు.
