Type Here to Get Search Results !

మరోసారి మానవత్వం చాటుకున్న హీరో మహేష్ బాబు.. చిన్నారి చికిత్సకు ఆర్థిక చేయూత

 Mahesh babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ గొప్ప మనస్సును చాటుకుంటున్నాడు. రీల్ హీరోగానే కాకుండా ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటూనే ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ బాబు అండగా నిలుస్తున్నాడు. చిన్నారులకు ఎవరికైనా సాయం కావాలంటే క్షణాల్లో ముందుకొస్తున్నాడు.




ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకుని మహేష్ బాబు ఆర్ధిక సహాయం చేయడంతో పాటు ఉచితంగా ఆపరేషన్ చేయించాడు. జిల్లాలోని జైనథ్ మండలంలోని గూడా సిర్సన్న గ్రామానికి చెందిన 10 నెలల చిన్నారి కనకాల వర్ష పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. కుటుంబం పేదరికంతో ఉండటంతో ఆర్థిక సమస్యల వల్ల చిన్నారికి చికిత్స చేయించలేక తల్లిదండ్రులు దాతల సహాయం కోరుతున్నారు.


ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నేత పాశం రాఘవేంద్ర చిన్నారి అనారోగ్యం విషయం తెలుసుకుని సాయం చేయడానికి ముందుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఎంప్లాయ్ హెల్త్ స్కీం అధికారి సురేష్ దృష్టికి తీసుకెళ్లాడు. సురేష్ చిన్నారిని నగరంలోని స్టార్ హాస్పిటల్‌లో చేర్పించాడు. స్టార్ హాస్పిటల్ ద్వారా ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. తన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫాండేషన్ ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేశాడు.

అలాగే చిన్నారి వర్షకు ఉచితంగా గుండె ఆపరేషన్ మహేష్ బాబు చేయించాడు. డాక్టర్ గోపీచంద్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ విజయవంతంగా సక్సెస్ అయింది. దీంతో చిన్నారి కుటుంబసభ్యులు మహేష్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన సురేష్, రాఘవేంద్రకు కూడా తాము జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఇప్పటివరకు దాదాపు వెయ్యికిపైగా చిన్నారులకు మహేష్ బాబు గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు అదే బాటలో మరో చిన్నారి ప్రాణాలు కాపాడిన మహేష్ బాబును అందరూ ప్రశంసిస్తున్నారు. ఇటీవల తన తండ్రి తుదిశ్వాస విడిచిన సమయంలో ఆ దుఖాన్ని భరిస్తూ ఆపదలో ఉన్న ఓ చిన్నారికి మహేష్ బాబు ప్రాణం పోసిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అమలాపురానికి చెందిన మోక్షిత్ సాయి అనే మూడేళ్ల బాబుకు గుండెలో రంధ్రం ఏర్పడటంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో ఆ బాబుకు మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా సర్జరీ చేయించాడు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. కృష్ణ మరణ వార్త విన్న రోజే ఆ చిన్నారికి ఆపరేషన్ విజయవంతమై బయటపడటంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad