తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నిమ్స్ కోసం ఏకంగా రూ. 1, 571 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోనే నిమ్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్ ను మరింత విస్తరణతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలను కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. వీటన్నింటి కోసం భారీ మొత్తం కేటాయించటం విశేషం. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు
నిమ్స్ విస్తరణకు ఏకంగా రూ. 1,571 కోట్ల నిధులు కేటాయించడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో ముందడుగన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
