తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగున్నదని ప్రశంసించింది. బంగ్లాదేశ్‌కు చెందిన 13 మంది మేయర్లు, ముగ్గురు అధికారులు మొత్తం 16 మందితో కూడిన ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది. బుధవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న సీడీఎంఏ కార్యాలయాన్ని సందర్శించింది. అక్కడ ఉన్న మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్‌ను పరిశీలించింది.
హరితహారం, బయోమైనింగ్, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, ద్రవ, ఘనవ్యర్థాల నిర్వహణ, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, ఎఫ్‌ఎస్‌టీపీల నిర్మా ణం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, పన్నుల విధానం తదితర అంశాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న బంగ్లాదేశ్ బృందం పట్టణప్రగతి కింద చేపట్టిన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ తదితర కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడయని ప్రశంసించింది. బంగ్లాదేశ్‌లోనూ ఈ తరహా విధానాలను, సంస్కరణలను అమలు చేసి మరింత మెరుగైన పాలనను అందించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ చాలా బాగున్నదని, పట్టణాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే దగ్గర లభ్యం కావడం నిజంగా అభినందనీయమని ప్రశంసించారు.

